భద్రాచలం,వెలుగు : ఈనెల 27న భద్రాచలం మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణానికి జనగామ జిల్లా ఘనపురం మండలం చెల్పూరుకు చెందిన భక్తరామదాసు మండలి భక్తులు భక్తిశ్రద్ధలతో సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని గోటితో వలిచి 14.10 క్వింటాళ్ల తలంబ్రాలను ఆదివారం ఈవో దామోదర్రావుకు అందజేశారు.
పదేళ్లుగా వీరు ఇదే విధంగా తలంబ్రాలు ఇస్తున్నారు. అంతకుముందు ఆలయ గర్భగుడిలో అర్చకులు సీతారామచంద్రస్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం నిర్వహించారు.
గోదావరికి నదీహారతి
భద్రాచలం, వెలుగు: భద్రాద్రిరామయ్యకు ప్రీతికరమైన ఏకాదశి వేళ గోదావరికి నదీహారతిని నిర్వహించడం ఎంతో సంతోషకరమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. గోదావరి తీరంలో ఆదివారం రాత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గోదావరి నదీ హారతిలో చెన్నైకు చెందిన శ్రీవాగ్దేవి కళాసమితి నాదోపాసన కళాకారులు చేపట్టిన సంగీత కార్యక్రమం భక్తులను అలరించింది. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
